విజయ్‌కు షాకిచ్చిన గవర్నర్.. ప్రభుత్వ ఏర్పాటుకు బ్రేక్
- రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన విజయ్
- మ్యాజిక్ ఫిగర్ 118కి మరో 6 సీట్లు తక్కువగా ఉన్న వైనం
- 118 మంది సభ్యుల సంతకాలు ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానన్న గవర్నర్
తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన టీవీకే అధినేత విజయ్‌కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ నుంచి ప్రతికూల స్పందన ఎదురైంది. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన విజయ్‌కు, సంఖ్యాబలం విషయంలో స్పష్టమైన నిబంధనలను గవర్నర్ గుర్తుచేశారు. తగినంత మెజారిటీ లేనిదే ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేమని గవర్నర్ స్పష్టం చేయడంతో తమిళనాడులో రాజకీయ సస్పెన్స్ మరింత ముదిరింది.
ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 118. అయితే ప్రస్తుత సమీకరణాల ప్రకారం టీవీకే బలం 108 సీట్లు (విజయ్ రెండు చోట్లా గెలవడంతో ఒక సీటుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాబట్టి నికరంగా 107). మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ బలం 5 సీట్లు. దీంతో మొత్తం బలం 112 అవుతుంది. ఈ క్రమంలో విజయ్ పార్టీకి మరో 6 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
విజయ్ గవర్నర్‌తో మాట్లాడుతూ, కాంగ్రెస్‌తో పాటు మరికొన్ని చిన్న పార్టీలు తమకు మద్దతు ఇస్తున్నాయని, ప్రమాణస్వీకారం తర్వాత అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకుంటానని వివరించారు. అయితే, ముందే 118 మంది సభ్యుల సంతకాలతో కూడిన మద్దతు లేఖ ఉంటేనే ఆహ్వానిస్తామని గవర్నర్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతానికి ఈ 6 మంది ఎమ్మెల్యేల కొరత తీరితే తప్ప విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం లేదు. మే 9న ప్రమాణస్వీకారం చేయాలని టీవీకే భావిస్తున్న తరుణంలో, వచ్చే 24 గంటలు అత్యంత కీలకంగా మారనున్నాయి.